కుళలుఱవుత్యాగి 
                 
 
 
పిలవగానే వచ్చేవాడు దేవుడు ! తలచగానే వచ్చేది సద్గురువు !!

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేస్వరి కృప
ఓం శ్రీ సద్గురువు కృప

కామాఖ్యా రహస్యము

ఓసారి కౌపీనధారి పెద్దాయన సిన్నోడు వెంకటరామన్‌ను కామాక్య తీర్థప్రాంతానికి తీసుకెళ్లారు. వాహన సదుపాయాలేవీ లేని కాలమది. ఎటూ చూసినా దట్టమైన అడవులు. భీకర వన్యమృగాలు సంచారం అధికంగా ఉండే స్థలమది. అక్కడ నివసించే ప్రజలు నాగరికత వాసనలు అంటని గిరిజనులు. 
కాలినడకనే సిన్నోడిని తీసుకెళుతున్న ఆ పెద్దాయన ఓ మర్రిచెట్టు దిగువన నిలిచాడు. 'బాబూ! ఇక్కడ కాసేపు రెస్టు తీసుకెళదామా' అనగానే సిన్నోడికి ఆ మాటలు చెవులకు ఇంపుగా వినిపించాయి. 
కారణం.. పొద్దున్నుంచీ సుమారు నాలుగైదు గంటలపాటు ఇద్దరూ పాదయాత్ర చేస్తున్నారు. మధ్యలో అన్నపానీయాలేవీ ముట్టలేదు. ఈ నాలుగైదు గంటసేపు నడిచినా ఎక్కడా ఓ బడ్డీకొట్టుకానీ, టీకొట్టుకానీ సిన్నోడి కంట పడలేదు. పళ్లున్న చెట్టుకానీ, కాయలున్న చెట్టుకానీ కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో అన్నపానీయాలు ఎక్కడి నుంచి వస్తాయి? దీనికి తోడు ఆ పెద్దాయన సిన్నోడిని ఎక్కడా కూర్చోనివ్వక వెంటపడి తరుముతున్నారాయె! 
అయితే ఇక్కడ సంతోషించాల్సి విషయం ఏమిటంటే ఎప్పుడూ మండుటెండలోనే నడిచేందుకు అలవాటుపడ్డ సిన్నోడికి ఎండవేడిమి తెలియకుండా నీడలో చల్లటి గాలుల మధ్య నడిచి రావటం ఓ వింత అనుభవంగా అనిపించింది. 
ఓ పెద్దభారాన్ని దింపినట్లుగా నిమ్మళంగా గురువుగారు చూసిన మర్రిచెట్టు నీడన ఇద్దరూ కూర్చున్నారు. సిన్నోడు కుదుటపడి కొన్ని క్షణాలు కూడా కాలేదు. 
కారణం.. 
దేన్నో చూసినట్లు ఉన్నట్టుండి పెద్దాయన లేచి నిలిచారు. ఆయన సప్తనాడులు స్తంభించాయి. సిన్నోడిదీ అదే పరిస్థితే. కీ ఇచ్చిన బొమ్మలా పెద్దాయన ఎంతటి వేగంగా నిలిచాడో చూసి సిన్నోడు అదే వేగంతో నిటారుగా ఆయన వద్దే నిలుచున్నాడు. 
ఆ ఇద్దరూ నిలిచిన చోటుకు కాసింత దూరంలో ఓ అడవి మనిషి వారివైపు నడిచివస్తున్నాడు. తలపై చింపిరిజుట్టు, అక్కడక్కడా పెనవేసుకున్న జడలతో ఉన్నాడు. చెవుల్లో కొయ్యతో చేసిన వలయాలు వేలాడుతున్నాయి. స్నానమే ఎరుగని నలుపుదీరిన శరీరం. అక్కడక్కడా మురికి పేరుకుపోయి ఉన్నాయి. మెడలో ఎముకల హారాలు. 
పెద్దాయన నడుముకు కౌపీనమైనా ఉంది. మరి అతడికో అది కూడాలేదు. అవధూత రూపం. కాళ్ళు చేతుల్లో పొడవుగా పెరిగిన గోళ్లు. మోకాలిని తాకేంతటి పొడవైన చేతులు. ఈ రూపానికి ఏ మాత్రం పొంతనలేకుండా అతడి కళ్లు మాత్రం ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. 
సిన్నోడు ఆ అడవిమనిషిని ఆశ్చర్యంగా చూస్తున్నంతలోపే వారికి దగ్గరగా వచ్చేశాడు. అంతే సిన్నోడికి కడుపులో కలియబెట్టినట్లయ్యింది. ఆ అడవి మనిషి వంటి నుండి మాంసపు వాసనకు తట్టుకోలేకపోతున్నాడు. 

అస్సాంలో నివసించే గిరిజనులు వంటవండుకోరు. అడవి జంతువులను వేటాడి, వాటి తోలు వలచి మాంసాన్ని ఇళ్ల ఎదుట వేలాడదీస్తారు. ఆకలేసినప్పుడు ఆ కళేబరంలో కొంత భాగాన్ని లాక్కుని తింటుంటారు. ఆ గిరిజనులు భద్రపరిచే మాంసం కుళ్లిపోకుండా, పురుగులు పట్టకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా ఆ మాంసం తినటానికి అనువుగా ఉండటం ఓ వింతే మరి! అలాంటి మాంసాన్ని ఆరగిస్తుంటారు కనుకనే వాళ్ల వంటి నుండి మాంసపు వాసనకు పేగుల్ని నులిమిపడేస్తుంది. ఈ విషయాన్ని సిన్నోడు ఆ ప్రాంతానికి వెళ్లిన కొద్ది రోజులకే తెలుసుకున్నా, ఇలాంటి దుర్వాసనను భరించలేకపోతున్నాడు. ముక్కు నోరు మూసుకుని కాస్త దూరంగా జరిగాడు. పెద్దాయన ఆ దుర్వాసనను ఏ మాత్రం పట్టించుకోలేదనిపిస్తోంది. ఆ అడవిమనిషితో ఆయన సంతోషంగా భక్తిపూర్వకంగా మాట్లాడుతున్నట్లనిపించింది. ఇద్దరూ మాట్లాడుతున్న భాష ఏమిటో ఒక్క పదం కూడా సిన్నోడికి అర్థం కాలేదు. అయితే అడవిమనుషుల మాటల్లో కనిపించిన మృదుత్వం సిన్నోడికి కాస్త ఆనందాన్ని కలిగించింది. ఆ అడవి మనిషి దంతాలు పాలిపోయి వికారంగా కనిపించాయి. అయితే అతడి నోటి నుండి వస్తున్న మాటలు ఎలా మృదువుగా వస్తున్నాయో సిన్నోడికి అంతుబట్టలేదు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. సిన్నోడికి చాలా దూరం వరకూ నడవడం వల్ల కలిగిన అలసట వల్ల కాళ్లు నొప్పిగా ఉంటున్నాయి. మరో వైపు ఆకలితో కడుపు మండిపోతోంది. 
ఏమీ అర్థంకాని స్థితిలో సిన్నోడు చూపు మరల్చకుండా ఆ ఇద్దర్నీ చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ గండు చీమ సిన్నోడి కాలిపై కుట్టడంతో బాధతో తుళ్లిపడి వంగి, చీమను నలిపి పారవేసి, కాలిని మర్ధన చేస్తూ తలెత్తి చూశాడు. ఆశ్చర్యం. ఆ పెద్దాయనతో మాట్లాడుతున్న ఆ అడవి మనిషి కనిపించలేదు. పెద్దాయన అప్పుడే సిన్నోడిని చూస్తున్నట్లుగా చూసి 'ఎక్కడికెళ్లావు నాయనా, రారా వచ్చి ఈ ఫ్యాంట్‌, షర్టు వేసుకో' అన్నారు. 
సిన్నోడు ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు. పెద్దాయన చేతిలో కొత్త ఫ్యాంట్‌, చొక్కా, బెల్టు, షాక్సు, బూట్లు, రేబాన్‌ కళ్లద్దం, టోపీ అన్నీ వున్నాయి. సిన్నోడిలో అంతదాకా ఉన్న అలసట, ఆకలి మటుమాయమైంది. ఆ దుస్తులు చాలా కొత్తవిగా అందంగా కనబడుతున్నాయి. 

దశముఖ దర్శనము
తిరుఅణ్ణామలై

ముదురు నీలిరంగు ఫ్యాంటు, గులాబీరంగు ఫుల్‌షర్టు... దానిపై అక్కడక్కడా ఎరుపు రంగు పువ్వులు, వజ్రాల్లాంటి రాళ్లు పొదిగి ఉన్న బెల్టు, నీలిరంగు టోపీ చూసి సిన్నోడి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అంతలోపే భయం కూడా కలిగింది. ఈ దుస్తులన్నీ ఎక్కడి నుండి వచ్చాయో సిన్నోడికి తెలియలేదు. ఆ దుస్తులను ఆ అడవి మనిషి తప్ప మరొకరు ఇచ్చే అవకాశమే లేదు. అతడో కౌపీనం కూడా ధరించని అడవిమనిషాయె! అతడెలా ఉన్నట్టుండి మాయమయ్యాడో అంతుబట్టడం లేదు. 
'ఈ దుస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక వేళ ఈ పెద్ద గురువే ఏదైనా మంత్రం వేసి ఈ దుస్తుల్ని రప్పించి, మనల్ని చిక్కులో పడవేయాలనుకుంటున్నారా?' అంటూ సిన్నోడి మదిలో ఎన్నో అనుమానాలు. 
అంతలోనే...'ఛీ..ఛీ.. ఏమిటిది? కేవలం కొత్త దుస్తుల్ని చూసి మాయలో పడి మన గురువుగారినే తప్పుగా భావించటం భావ్యమా?' అంటూ లోలోపల నలుగిపోతుండగానే పెద్దాయన 'బాబూ ఆలోచనలకు ఇది సమయం కాదురా! చీకటి కమ్ముకుంటే అడవి మృగాలన్నీ తరుముకొస్తాయి. శీఘ్రంగా వీటిని తొడుక్కుని బయల్దేరు' అంటూ సిన్నోడిని పురమాయించాడు. 
సిన్నోడు ఏమైతే అయిందలేననుకుంటూ గబగబా ఆ దుస్తుల్ని వేసుకున్నాడు. 'సూపర్‌స్టార్‌' పెద్దాయన వెనకే నడిచాడు. 
నాలుగడుగులు వేశారో లేదో ఆలోపే 'ఆహా! మరచిపోయాను కదరా?' అంటూ తన కౌపీనం నుండి ఆకులతో చుట్టినటొక పొట్లం బయటికి తీశారు. దాన్ని సిన్నోడి చేతికిచ్చి 'తినరా' అన్నారు. 
సిన్నోడు ఆ పొట్లం విప్పి చూశాడు. 
అదేదో ఆకులో చుట్టి ఉన్న ఒక సిన్న సైజు మరమరాల ఉంట అది. గోలీకాయ కంటే కాస్త పెద్దది. ఓ వైపు పెద్దాయన తన ఆకలిని గుర్తించి తినుబండారాన్ని ఇచ్చాడని సంతోషపడుతూనే మరో వైపు ఏనుగంతటి ఆకలికి ఈ చీమంత సెనగ వుంటను ఇచ్చారే అని అనుకుంటూ మరమరాల ఉంటను చేతిలోకి తీసుకుని ఆకును పడేసేందుకు సిద్ధమయ్యాడు. ఆలోపే పెద్దాయన సిన్నోడి చేతిలోని ఆకును గబుక్కున లాక్కుని దానిని కళ్లకద్దుకుని తన కౌపీనం దగ్గరగా తీసుకెళ్ళాడు. అంతే! ఆ ఆకు మాయమైంది. అది ఎక్కడికెళ్లిందో సిన్నోడి కంటపడలేదు. 
సిన్నోడు ఆలోచనలో పడ్డాడు. మన చేతిలో ఉన్నది సాదాసీదా మరమరాల ఉంట కాదు. ఈ ఉంటను చుట్టి వుండిన ఆకును పెద్దాయన కళ్లద్దుకున్నారంటే ఈ వుంట సంగతి! ఇందలో ఏదో మహత్యం ఉంది. వాటిని గురించి తర్వాత అడుగుదాం. ఆలోపున దీని పనిబడదాం అనుకుని ఆ ఉంటను చిన్న చిన్న ముక్కలుగా నోట కరచి రుచిచూడసాగాడు. సిన్నోడు ఊహించిన్నట్లే ఆ ఉంట రుచి అద్భుతంగా ఉంది. ఆ రుచి వర్ణించలేనంత తియ్యగా కమ్మగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాలకడలిలో పుట్టిన దేవామృతం కూడా ఇంత రుచిగా ఉండదేమో! మరమరాల ఉంట తియ్యదనానికి సిన్నోడు వింత అనుభూతిని పొందుతున్నంతలోపే పెద్దాయన కేక విని ఉలిక్కిపడ్డాడు. 
'బాబూ నీ దుస్తులంతా విప్పేయరా!' 
సిన్నోడికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడే... తాను కొత్త దుస్తులు ధరించి ఉన్నట్లు అప్పుడే గుర్తుకొచ్చింది. ఆ కొత్త దుస్తులను తనివితీరా చూడకమునుపే ఈ పెద్దాయన ఎందుకు విప్పమంటున్నారో కదా అని విసుక్కుంటున్నంతలోనే... 
ఆ చోట చిన్న జలాశయం కనిపించింది. అందులోని నీళ్ళు చాలా స్వచ్చంగా ఉన్నాయి. సిన్నోడికి ఒకటే ఖుషీ! ఆ సంతోషంలోనే గబగబా దుస్తులు విప్పి పెద్దాయన ఆనతి కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. 
ఆ పెద్దాయన కంటితో జాడచూపగానే, తనకు తెలిసిన స్నానపు మంత్రాలు కొన్నింటిని చెబుతూ చల్లటి నీటిలో వరుణ ప్రవేశం చేశాడు సిన్నోడు. 
ఆహా... ఆ స్వర్గమే తన ఎదుట వచ్చినంతగా సంబరపడ్డాడు సిన్నోడు. అలసట తీరింది. అప్పర్‌ పెరుమాళ్‌ విరచిత శ్లోకాలు జ్ఞప్తికి వచ్చాయి. ఐదు నిమిషాలు కూడా కాలేదు. ఆలోపే పెద్దాయన పిలుపు! 
'ఒరేయ్‌ బాబూ స్నానం చేసింది చాలు. శీఘ్రంగా రారా! అమ్మవారిని దర్శనం చేసుకోవాలి' అన్నాడాయన. 
అర్థమనస్సుతోనే జలాశయం నుండి బయటపడి ఫ్యాంటు వేసుకున్నాడు. దాని బొత్తాలు కూడా పెట్టుకోలేదు. పెద్దాయన 'ఒరేయ్‌ ఫ్యాంట్‌ షర్టు వేసుకోవడానికి ఇంతసేపా? పరుగెత్తురా' అంటూ అతడి చేతిని పట్టుకుని బిరబిరా లాక్కెళుతూ అడవి దారిలో పరుగులు తీశాడు. 
సిన్నోడికి ఏమీ అర్థం కాలేదు. 
'గురువుగారూ... చొక్కా... చొక్కా' అంటూ గట్టిగా అరిచాడు. 
పెద్దాయన ఆ కేకల్ని పట్టించుకోలేదు. సిన్నోడి చేతిని గట్టిగా పట్టుకుని వేగం తగ్గించకుండా పరుగెత్తుతూనే ఉన్నారు. 
సిన్నోడి కళ్లవెంబడి కన్నీరు జలపాతంలా ప్రవహించింది. అందమైన షర్టు, బూట్లు, బెల్టు, జీవితంలో తొలిసారిగా పెట్టుకున్న రేబాన్‌ కూలింగ్‌ గ్లాసును పదేపదే తలచుకుంటున్నాడు. 
ఏందుకీ పెద్దాయన వేటినీ పూర్తిగా అనుభవించకముందే ఇలా బాధిస్తున్నాడోనని బాధపడ్డాడు సిన్నోడు. మనసులో ఏమనుకుంటున్నదీ ఇట్టే పసిగట్టేస్తాడు కదా అనే భయం కూడా కలిగింది సిన్నోడికి. పెద్దాయన నడక వేగాన్ని అందుకోలేక కాస్త మెల్లగానే ఆయన వెనుకే పరుగెత్తాడు. 
పెద్దాయన కూడా అతడి చేతిని విడిచిపెట్టి నడక వేగాన్ని కాస్త తగ్గించారు. 
సుమారు అరగంట గడిచాక వారు వెళుతున్న దారి కాస్త ఇరుకైంది. సిన్నోడికి ఇరువైపులా చెట్ల కొమ్మలు రాసుకుంటున్నాయి. అప్పుడే బూట్లు లేని తన పాదాలను చూసి గతుక్కుమన్నాడు. 

శ్రీ ఇడుక్కు పిల్లైయారు సన్నది
తిరుఅణ్ణామలై

ఎన్నో జలగలు తన పాదాన్ని పట్టుకుని వెంబడిస్తుండటాన్ని చూసి బిత్తరపోయాడు. సిన్నోడు బిగ్గరగా 'గురువుగారూ జలగలు.. జలగలు' అంటూ కేకలు పెట్టాడు. వాటిని వదలించుకునేందుకు ప్రయత్నించాడు. 
పెద్దాయన ఏమి ఎరుగనట్లు అతడి కాళ్లవైపు చూసి, 'ఒరేయ్‌ ఇన్ని జలగలు అంటుకున్నా వాటిని విదిలించక ఏం చేస్తున్నావురా, ఈ అడవిలో జలగలు ఎక్కువగా ఉంటాయనే కదరా నీకు బూట్లు వేసుకోమని చెప్పినా జలాశయాన్ని చూసిన సంతోషంలో బూట్లను అక్కడే వదలిపెట్టి వచ్చేసి, ఇప్పుడు జలగలు పట్టుకున్నాయని కేకలేస్తే నేనేమి చేసేది?' అని అడిగాడు. సిన్నోడు ఏం చేయగలడు? ఈ పెద్దాయన ఓ చేత బిడ్డను గిల్లి, మరో చేత్తో ఊయలను ఊపే విధంగా చేసిన లీలలెన్నింటినో అనుభవించినవాడే కదా ఈ సిన్నోడు? 
కనుకనే ఏదో అడగాలనుకున్నా సిన్నోడి నోరు పెగల్లేదు. జలగలతో జగడానికే సిద్ధమయ్యాడు. 
సిన్నోడు ఎంత ప్రయత్నించినా ఆ జలగలు అతడిని విడిచిపెట్టేలా లేవు. అతడి కాలిని ఉడుంపట్టులా పట్టేశాయి. పెద్దాయన వెంటనే తన చేతితో ఆ జలగలను విదిలించాడు. ఆశ్చర్యం ఆ పెద్దాయన చేతులాడించి తాకక మునుపే ఆ జలగలన్నీ ఉన్నట్టుండి మాయమయ్యాయి. 

ఆహా పీడ విరగడైందని అనుకున్నంతలోనే సిన్నోడి వళ్లంతా జలగలను చూసి బిత్తరపోయాడు. మళ్లీ గురువుగారి వైపు బిగ్గరగా గావుకేకలు పెట్టాడు. భయంతో అతడి వళ్లంతా వణకుతోంది. కళ్లవెంబడి కన్నీరు కారుతోంది. 'ఒరేయ్‌ సిన్నోడా! కాసింత జలగలకే ఇంత భయపడితే రేపోమాపో నీవెంటబడే పులులు, సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, గుంటనక్కలను ఎలా ఎదుర్కోగలవురా?' అంటూ సిన్నోడి వంటిపైనున్న జలగలను విదిలిస్తూ నడిచారు పెద్దాయన. పెద్దాయన పులులు, సింహాలు అంటూ భయపెట్టడంలో అంతరార్థం సిన్నోడికి బోధపడింది. భవిష్యత్తులో ఆ మృగాలను పోలిన చెడు గుణాలు కలిగిన వారిని ఎలా ఎదుర్కొంటావని ముందుచూపుతో అంటున్న మాటలని అర్థం చేసుకున్నాడు వెంకటరామన్‌ అనే ఆ చిన్నోడు. 
ఇలా జలగలతో నిండిన ఆ దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటేందుకు మూడుగంటలకు పైగా పట్టింది. జలగల నుండి తప్పించుకునేందుకు ఆ సిన్నోడు వంగుతూ లేస్తూ తనకు తెలిసిన యోగాసనాలన్నింటినీ వేశాడు. 
అప్పుడే ఓ అద్భుత దృశ్యం సిన్నోడి కంటపడింది. జలగలన్నీ ఫ్యాంట్‌ ధరించిన తనపై సామూహికంగా జరిపిన దాడిలో వళ్లంతా బొబ్బలు లేచి అక్కడ రక్తం కారుతోంది. కానీ కౌపీనం మాత్రమే ధరించిన ఆ పెద్దాయనను కనీసం ఓ జలగ కూడా కాటు వేసినట్లుగా లేదు. 
ఆ విషయాన్ని పెద్దాయనను అడిగాడు. 
'సిన్నోడా! పెద్దగా కారణాలేమీ లేదురా. నీది యువరక్తం కనుకనే జలగలకు నీ రక్తం బాగా నచ్చింది. నేనా కాటికి కాళ్లు చాపుకున్న ముసలోడ్ని కనుక నా రక్తం వాటికి నచ్చలేదు. ఇదే నిజమైన కారణం' అంటూ చిరునవ్వు నవ్వాడు. 
పెద్దాయన చెప్పిన సమాధానం సిన్నోడికి తృప్తినివ్వకపోయినా అంతకు మించి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. 
సూర్యాస్తమయం కాకమునుపే ఇద్దరూ కామాఖ్యా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోపలి అమ్మవార్లను దర్శనం చేసుకుని ఆ పొద్దు ఆ పెద్దాయనతో ఆ ఆలయం వద్దే గడిపే మహాభాగ్యాన్ని పొందగలిగాడు ఆ సిన్నోడు. 
తీర్థయాత్రలు చేసేటప్పుడు సిన్నోడిని పుణ్యక్షేత్రాలలో బాగా సేద తీరేలా పూర్తిగా విశ్రాంతి తీసుకునేందుకు పెద్దాయన అనుమతిస్తుంటారు. అప్పుడే మర్నాడు వేకువజాము బ్రాహ్మీముహూర్తంలో తమ యాత్రను కొనసాగించేందుకు వీలుపడుతుంది. 
అయితే కామాఖ్యా ఆలయంలో పెద్దాయన సిన్నోడిని నిదురపోనియకుండా దేవీ లీలావిశేషాలను పూసగుచ్చినట్లు వివరించసాగారు. వేకువజాము వరకూ పెద్దాయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించారు. అంతటితో ఆగలేదు. భార్యాభర్తల దాంపత్య రహస్యాలను సైతం విడమరచి చెప్పారు. 
తొమ్మిదేళ్ల ప్రాయంలో ఉన్న వెంకటరామన్‌కు అవేవీ మింగుడుపడలేదు. ''గురువుగారూ మీ మాటలేవీ నాకు అర్థం కాలేదు'' అన్నాడు సిన్నోడు. అందుకా పెద్దాయన ''ఇప్పుడవన్నీ నీకు అర్థం కాకపోవచ్చు. కానీ సరైన సమయంలో అవన్నీ నీకర్థమవుతుందిలే. భవిష్యత్‌లో నిన్నాశ్రయించే వేలాదిమంది ఆంతరంగిక సమస్యలను నీ వద్ద ఏకరువుపెట్టేటప్పుడు ఇవన్నీ నీకు తప్పకుండా సాయపడతాయి. అంతేకాదురా ఎన్నో జంటలకు పెళ్ళిళ్లు చేయబోతున్నావు. అప్పుడీ చిన్న విషయాలు కూడా తెలియక నువ్వు బిక్కమొహం వేయకూడదనే కష్టపడి ఇంతదూరం తీసుకువచ్చి మరీ నీకు ఈ విషయాలను చెబుతున్నానురా' 
''ఏ సంగతులను ఏ ప్రాంతాల్లో చెప్పాలో మాకు మాత్రమే తెలుసు. దాన్ని గురించి నువ్వు దిగులుపడొద్దు!'' 
ఆ పెద్దాయన చెప్పినట్లే భవిష్యత్‌లో శ్రీవెంకటరామన్‌ స్వామివారిని ఆశ్రయించిన ఎన్నో జంటల దాంపత్య సమస్యలను పరిష్కరించి వారి మధ్య అన్యోన్యతలను పెంచి సమాజంలో శాంతి సుఖాలను పెంపొందింపజేయనున్నవారి సంఖ్య లెక్కకు మిక్కుటం. 
ఈ కామాఖ్యా యాత్ర సందర్భంగా పెద్దాయన వెల్లడించిన అద్భుత ఆధ్యాత్మిక సౌరభాలను మీరిప్పుడు ఆస్వాదిస్తున్నారు. 
దేవీ దర్శనం తర్వాత మళ్లీ కాలినడకనే సిన్నోడు, పెద్దాయన స్వస్థలానికి చేరుకున్నారు. దారి పొడవునా జలగలు మళ్లీ దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలిరా దేవుడా అంటూ ఆలోచించిన సిన్నోడికి ఆశ్చర్యమేసింది. తిరుగు ప్రయాణంలో ఎక్కడా జలగలు కనిపించనే లేదు. ఈ విషయం గురించి పెద్దాయనను అడిగితే ''ఎక్కడి నుండి వచ్చాయిరా జలగలు? ఎక్కడికి పోయాయిరా జలగలూ?'' అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి వెంకటరామస్వాములవారికి పలు మాసాలు పట్టింది. మరి మీకో...? 
ఇక జలగలు తనపై దాడి చేయవని కుదుటపడి సిన్నోడు పెద్దాయనతో కలిసి నడిచాడు. అప్పుడే ఓ ఆటవిక జాతి యువతి ఎదురుగా వస్తుండటాన్ని గమనించాడు సిన్నోడు. ఆ యువతికి ఇరవైయేళ్లుంటుందేమో. రొమ్ముపై ఎలాంటి ఆచ్చాదనలు లేవు. నడుము చుట్టూ ఆకులు అలములు కట్టుకొని ఉంది. అందమైన దేహంతో ఉందా యువతి. తలపైని శిరోజాలను అందంగా చుట్టి, చక్కగా కొప్పువేసుకుని అందులో ఓ సన్నటి పుల్లను గుచ్చిపెట్టుకుంది. మెడలో కొన్ని పూసల దండలు. నుదుట సింధూర తిలకం. చటుక్కున చూస్తే కాళికాదేవిలాంటి రూపంలా ఉంటోంది. చేతుల నిండా కొయ్య గాజులు. పెద్దాయన ఆ యువతిని చూడగానే 'ఓం' అంటూ నమస్కరించారు. సిన్నోడికి ఏమీ అర్థం కాలేదు. పెద్దాయనను చూసి ఆ యువతి క్రీగంట చూస్తు చిరునవ్వు నవ్వింది. సిన్నోడు తళుక్కున మెరసిని ఆ యువతి పలువరుసను చూసి మురిసిపోయాడు. అంతటి అందమైన దేహంలో ఆమె దంతాలు ఎలా ముత్యాల్లా మెరసిపోతున్నదీ సిన్నోడికి అర్థం కాలేదు. 

పంచముఖ దర్శనము
తిరుఅణ్ణామలై

చిరునవ్వుతో ఆ యువతి పెద్దాయనతో ఏవో చెబుతోంది. అయితే సిన్నోడికి ఆ యువతి నోటిలో జాలువారుతున్న మాటలుగానీ, పెద్దాయన సమాధానంగా చెబుతున్న మాటలుగానీ ఏవీబోధపడలేదు. అయితే ఆ యువతి అప్పుడప్పుడు తనను ఓరకంట చూస్తుండటాన్ని గమనించాడు సిన్నోడు. ఉన్నట్టుండి సిన్నోడికి భయమేసింది. ఆటవికులకు చాలా మంత్రాలు తెలుసునని విన్నామే? ఈ యువతికూడా మంత్రగత్తెగా ఉంటుందేమో? అయితే ఆ యువతి నవ్వు దైవికభావనలను విరజిమ్మేలా ఉన్నాయి కదా. అయితే తప్పకుండా ఈవిడ దేవకన్యగానే ఉంటుంది. 
ఏది ఏమైనా పెద్దాయన తోడుగా ఉండగా మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు కదా మనకెందుకు భయం? అనే మేకపోతు గాంభీర్యం అతడిలో చోటుచేసుకుంది. ఆలోపున పెద్దాయన సైగ చేయడంతో సిన్నోడి ఆ యువతి చెంతకు వెళ్లాడు. ఆ యువతి నేలపై కూర్చుని, సిన్నోడిని తన దగ్గరగా కూర్చోమంటూ సైగ చేసింది. సిన్నోడు ఆ యువతి పక్కనే కూర్చున్నాడు. ఆహా ఆశ్చర్యం! అస్సాంలోని ఆటవికుల వంటి నుండి వెలువడే మాంసపు వాసన ఈ యువతి వద్దలేదేమిటా అని ఆశ్చర్యపోతూండగా ఆమె దేహం నుండి సుగంధాలు వెలువడుతున్నట్లు సిన్నోడు తెలుసుకున్నాడు. 
ఆ యువతి సిన్నోడి కుడిచేతిని తన వడిలో పెట్టుకుని, అతడి అరచేతిని తీక్షణంగా చూస్తూ చేతితో మృదువుగా మర్దన చేసింది. 
అంతే! సిన్నోడి కళ్లనుండి కన్నీళ్లు జలధారలా ప్రవహించసాగాయి. అతడి దేహంలో విద్యుత్‌ తరంగాలు ప్రవేశిస్తున్నట్లు అనిపించింది. 
ఆ సిన్నోడు ఎందుకు అలా విలపించాడు? 
ఆ ఆటవిక యువతి చేయి తన అరచేతిని తాకగానే సిన్నోడికి ఉన్నట్టుండి తన తల్లి జ్ఞాపకానికి రావటమే అతడి ఏడుపుకు కారణమైంది. 
శ్రీస్వాముల వారిది ఎంతోమంది అన్నాచెల్లెళ్లతో కలిసి జీవించిన ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం! ఈ అనుభవాన్ని గూరించి స్వామివారి మాటల్లోనే తెలుసుకుందాం: 
''పోద్దుగుంకితే చాలు అందరమూ మా అమ్మ చుట్టూ కూర్చునేవాళ్ళం. మా అమ్మ ఓ పెద్ద పాత్రలో అన్నం వేసి, రసం పోసి చక్కగా కలిపి అందరి చేతులలో అన్నపు ముద్దలు పెట్టేది. నంచుకునేందుకు ముద్దపప్పు వేసేది. మా అమ్మచేతి వంట రుచిని ఎక్కడా అనుభవించలేదు. 
దేవుడి దయ వల్ల నేను సంచరించని దేశమే లేదు. వెళ్లని ఊరే లేదు. భోజనం చేయని హోటలంటూ ఏదీ లేదు. ఫైవ్‌స్టార్‌, సెవెన్‌స్టార్‌ అంటే అన్ని హోటళ్ళలోనూ భోజనం చేశాను. అయితే మా అమ్మగారు అందించిన ముద్దపప్పుతో కలిపిన ఆ అన్నపు రుచిని ఏ దేశపు ఆహారంలోనూ నేటి దాకా అనుభవించలేదు. 
మా అమ్మగారు ఆ అన్నాన్ని ముద్దలుగా చేసి వరుసగా అందరి చేతుల్లో పెడుతూ వెళ్లేది. మేమూ కడుపారా ఆరగించేవాళ్లం. ఆ అన్నం మీకు గనుక లభిస్తే ఒక శేరు అన్నాన్ని ఇట్టే లాగించేస్తారు. అంతటి రుచ్చి ఉండేదా మా అమ్మచేతివంటకంలో. 
ఆ పాత్రలోని అన్నం ఖాళీ అయిన తర్వాతే మేం తినటాన్ని ఆపివేస్తాము. ఓ రోజు యథేశ్చగా ఓ విషయాన్ని గమనించాను. మనకందరికీ అన్నాన్ని ముద్దలు చేసి ఇస్తోంది కదా, మా అమ్మ భోంచేసిన దాఖలు లేవే అని అనుకుంటూ ఓ రోజు భోజనంగా అయిన తర్వాత అందరూ చేతులు కడిగేందుకు పెరట్లోకి వెళ్లిన పిదప అమ్మా మా అందరికి ముద్దలు చేసి అన్నం పెట్టావు కదా నీకు భోజనం ఉందా అని అడిగాను. 'హుమ్‌...ఉంది నాయనా మీ నాన్నగారు వచ్చిన తర్వాత భోంచేస్తానులే. ఇలాంటి ప్రశ్నలడక్క వెళ్లి పడుకో' అని బెదరించింది. నేను పట్టువిడవకుండా 'అమ్మా అదంతా తర్వాత ముందు నీకు భోజనముందో లేదో చూపిస్తేనే నేను నిదురపోతాను అంటూ భీష్మించుకున్నాను. గత్యంతరం లేక మా అమ్మ ఆ పాత్రను చూపింది. అందులో అన్నం మెతుకు లేదు. అమ్మగారి త్యాగమంటే అదే. అమ్మను వాటేసుకుని బోరున విలపించాను. అప్పుడా నేనొక చిన్న పిల్లాడిని. కనుక ఏం చేయగలను? 
స్వాములు ఈ మాటలంటున్నప్పుడు ఆయన కళ్లు చెమర్చాయి. అలాంటి అద్భుతమైన కరుణామూర్తి గురించి వింటున్న భక్తులందరి కళ్లలోనూ కన్నీరొలికింది. 
పులికి పుట్టింది పిల్లి అవుతుందా? 

శ్రీ భూతనారాయణ వారి సన్నది
తిరుఅణ్ణామలై

ఇంతటి అద్భుతమైన హస్తగుణం ఉన్న మీనాక్షి అమ్మవారి దైవీక సంతానమైన శ్రీవెంకటరామస్వాములు ఆ తర్వాత కాలంలో రుచీ శుచీ కలిగిన వివిధ రకాల అన్న ప్రసాదాలను దానం చేశారంటే అందులో అతిశయోక్తి లేదు కదా! ఇందులో పలు రహస్యాలు కూడా ఉన్నాయి. వాటిని తర్వాత చూద్దాం. 
సిన్నోడి అరచేతిని కాసేపు తీక్షణంగా చూసిన ఆ ఆటవిక యువతి తన నడుము నుండి పొడవైన సూదిని, కొన్ని ఆకులను బయటికి తీసింది. ఆ పదునైన మొనదేలిని సూదితో ఆ పచ్చాకుపై రుద్ది, సిన్నోడి వంటిపై గుచ్చుతూ కన్య, తేలు, పులి వంటి పలు ఆకారాలను గీసింది. 
సిన్నోడికి చాలా సంతోషం. ఆకుపచ్చరంగులో అద్భుతంగా గీసిన ఆ బొమ్మలు తళతళా మెరిశాయి. అన్ని బొమ్మలు గీయడం అయ్యాక పెద్దాయనతో ఏదో అర్థంకాని భాషలో ఒకటి రెండు మాటలు మాట్లాడిన తర్వాత అక్కడి నుండి ఎక్కడికో వెళుతూ అదృశ్యమైంది ఆ వనవాసపు వనిత. 
సిన్నోడు పెద్దాయనవద్ద అడిగారు. 'గురువుగారూ ఎవరీ యువతి? ఇంత అందంగా డబ్బులు కూడా అడక్కుంగా నాకు పచ్చబొట్లు పొడిచి వెళ్లిపోయిందే' అని. 
పెద్దాయన విసుక్కున్నాడు 'అవునర్రా నువ్వడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చే నేను టైర్డ్‌ అయ్యేలాగున్నాను. మనకు చాలా పనులున్నాయ్‌. ముందు వాటి సంగతేమిటో చూద్దాం రా' అంటే బిరబిరా అడవి దారమ్మంటూ వేగంగా నడిచాడు. 
జలగల బెడద లేపోవడంతో పరుగులాంటి నడకతో కొత్త బట్టలందుకున్న మర్రిచెట్టు వద్దకు చేరుకున్నాడు. సిన్నోడికి అల్పాశ. ఒక వేళ పెద్దాయన ఆ షర్టు, ఫ్యాంటు, బూట్లు అన్నీ తనకిస్తాడేమోనని అటు ఇటూ చూశాడు. 

ఉన్నది కూడా పోయింది

పెద్దాయన 'బాబూ ఆ ఫ్యాంట్‌ తీసివ్వరా' అని చెబుతూనే ఆ చెట్టు కొమ్మపై దాచిన పాత అరనిక్కరు, పాత చొక్కాను అతడి చేతికిచ్చారు. 
ఇవన్నీ ఇంతదాకా ఎక్కడుండేవి? ఎలా పెద్దాయన చేతికొచ్చాయి? 
ఎప్పటిలాగే సమాధానంలేని ప్రశ్నలు! 
చేతికందినవి నోటికందలేవని చెబుతారే అదీ ఇదే కాబోలు అనుకుంటూ ఆ అందమైన ఫ్యాంట్‌ను విప్పి పెద్దాయనకు ఇచ్చాడు. 
పెద్దాయన 'పెరగవలసిన బిడ్డరా నువ్వు, ఇలా శివుడి సొమ్ముకు ఆశపడొచ్చా?' అంటూ చిరునవ్వు నవ్వాడు. 
'ఇక్కడ శివుడి సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చింది గురువుగారు?' అడిగాడు సిన్నోడు. 
పెద్దాయన 'అవున్రా బాబు. ఇదంతా నీకెవరిచ్చారనుకుంటున్నావు. నీ పిచ్చుక బుర్రను ఉపయోగించి చూడు.. ఆ రోజు వచ్చాడే అడవి మనిషి. అతడెవరనుకుంటున్నావు. సాక్షాత్తు పరమేశ్వరుడేరా' 
అవును కదా. సిన్నోడికి అంతా అర్థమైపోయింది. సర్వలోకమూ పెద్దాయనను చూస్తే అణగిపోతుంది. పెద్ద పెద్ద మేధావులంతా నోరుమూసుకుని మౌనం పాటించేస్తారు. అలాంటి పెద్దాయనే ఆ అడవి మనిషిని చూసి సప్తనాడులు స్తంభించిపోయి నిలబడ్డారు కదా! అలాంటప్పుడు ఆ మనిషి మహేశ్వరుడు కాక మరింకెవ్వరు? 
'ఈ చిన్న సంగతిని కూడా తెలుసుకోలేకపోయామే.. పెద్దాయన చెప్పినట్లు నాది పిచ్చుక బుర్రే' అని అనుకున్నంత లోపే అతడి ఆలోచనలను పసిగట్టిన పెద్దాయన 'నీ ఆలోచన నిజమేరా. అతడే మహేశ్వరుడే. అతడే నా వద్ద వేదం పఠించాడు. నువ్వేమో అతడేదో వాగుతున్నాడనుకుని పట్టించుకోకపోవడం ఎవరి తప్పు? 
సిన్నోడికి శివుడికి గురించి ముందుగా చెప్పలేదే అని పెద్దాయనపై కోపమొచ్చింది. ఓ వైపు బాధగానే అనిపించినా మరో వైపు ఆ పరమాత్మ పరమశివుడే తనకు బూట్లు, సాక్సులు సహా కొత్త బట్టలిచ్చిన ఆ కరుణామూర్తిని తలచుకున్న మరుక్షణమే అతడి కళ్ల చెమర్చాయి. 
పెద్దాయన 'ఒరేయ్‌! ఇక సీన్‌ వేసింది చాలు! పనులు చాలా పనులు ఉన్నాయి. రా పోదాం' అంటూ సిన్నోడిని పురమాయించాడు. 
సిన్నోడు తనకు తానే ఓదార్చుకున్నాడు. ఇప్పుడు శివుడి ముద్దు బిడ్డ తనే కదా అనే ధీమా పుట్టుకొచ్చింది. కొద్దిగా ధైర్యం తెచ్చుకుని పెద్దాయనను అడిగాడు. 'గురువుగారూ! ఆ దేవామృతమైన మరమరాల ఉంట గురించి ఏమీ చెప్పలేదే?' 
'అవున్రా ఎల్‌కేజీ నుండి కాలేజీ వరకూ నీ గురువును నేనేనా' అంటూ చిరుకోపం ప్రదర్శించాడు. 
'ఏమీ లేదురా. సోమాసి మారనారు యాగానికి స్వామి, అమ్మవార్ల (అంగాళిదేవి)తో నన్నుకూడా తీసుకెళ్లారు. అప్పుడు ఆ స్వామి వద్ద నన్నే నీడగా ఆశ్రయించిన సిన్నోడు ఉన్నాడు. అతడికి మీ చేతుల మీదుగా ఓ ప్రసాదం ఇస్తే బాగుంటుంది కదా' తలగోక్కుంటూ అడిగాను రా అంటూ పెద్దాయన తలను ఎలా గోక్కుని నిలిచింది నటించి మరీ చూపించారు. పెద్దాయన నటనను చూసి సిన్నోడు నవ్వాపుకోలేకపోయాడు. కడుపుబ్బేలా పకపకా నవ్వాడు. 

కామదహన దర్శనము
తిరుఅణ్ణామలై

'స్వామి కూడా శిష్యుడి కోసం శానా కష్టపడుతున్నావు. అయితే నీ పేరును అతడు కాపాడతాడో లేదో తెలియదు. అయినా ఫరవాలేదు. నీకోసం నీ శిష్యుడి కోసం ప్రసాదం ఇస్తున్నాన్నంటూ ఆ సోమాసి యాగ ప్రసాదంలోంచి ఆ చిన్న ఉంటను తీసి నా చేతిలో పెట్టాడు. ఆ ప్రసాదమే నీకిచ్చాను' అంటూ సోమాసి లీలా విశేషాలను వివరించాడు. 
తనకంటూ ఏదీ దాచిపెట్టుకోకుండా అన్నింటినీ, తన ప్రాణంతో సహా పరుల బాగోగులకే అంకితమైన శ్రీవెంకటరామ స్వామివారు ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక, దైవీక లీలావిశేషాలను సామాజిక సంక్షేమం కోసం ఎలా సమర్పించాడో తెలుసుకోవడం గురువుపైని విశ్వాసాన్ని పెరిగే సాధనమవుతుంది. 
పెద్దాయన కామాఖ్యయాత్రలో శివుణ్ణి కలుసుకున్నారు కదా? ఆ సమయంలో అడవిమనిషి రూపంలో పరమేశ్వరుడు తనకు వేదం చెప్పాడన్నారు కదా? ఆ వేదమే సామవేదంలోని భార్గవశాఖగా రూపుదిద్దుకుంది. 
చిన్న కుర్రవాడిగా ఉన్న వెంకటరామన్‌కు ఆ భార్గవ వేదాన్ని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాడు. అయితే పలు సంవత్సరాలు గడిచిన తర్వాత శ్రీలశ్రీ లోబామాత అగస్త్య ఆశ్రమంలో ఈశ్వరనామ సంవత్సరం నిర్వహించిన కార్తీక దీప అన్నదాన వైభవం నాడు అన్ని దైవ కార్యాలలోనూ ఈ భార్గవ వేద గీతాలను మన వెంకటరామన్‌ స్వామిగారు పఠించి మహేశుడి సామవేద శక్తులన్నీ ఆ యేడాది అరుణాచలేశ్వరుని ప్రదక్షిణం చేసి వచ్చే భక్తులందరికీ అన్నదానం వల్ల కలిగే విధంగా అద్భుతమైన సేవలను అందించారని చెప్పటం అతిశయోక్తి కాదు. ఆధ్యాత్మిక సత్యమూ అదే. 
స్వాములే కాకుండా ఆ యేడాది అన్నదాన వైభవంలో పాలుపంచుకున్న భక్తులందరికి మేలు కలిగేలా ఓ రోజు ఉదయం ఆరుగంటల నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా భార్గవ వేద శక్తులను సులువైన గాయత్రీ చంధస్సులో రూపొందించి సాధారణ భక్తుడిని కూడా సామవేదం ఆలపించేలా చేసిన పుణ్యమూ ఈ స్వామికే దక్కుతుంది. 
సామవేదాన్ని ఔపోసన పట్టిన మహాభక్తులు సైతం ఆ వేదగానానికి తన్మయం చెందారు. 
జలగలంటేనే విసుగు, భయమూ కలిగించే పురుగులా భావిస్తుంటాము. భార్గవ వేదులని సిద్ధులచే పిలువబడే ఆ పురుగులు వేద బీజాక్షర శక్తులను పీల్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. భార్గవ మహర్షి కుమార్తె భార్గవియే శ్రీమహావిష్ణువు ఛాతీపై స్థిరనివాసం చేస్తోంది. కనుకనే ఆ విష్ణువు యొక్క ఔషధ శక్తి అవతారమైన ధన్వంతరీ మూర్తి జలగను ధరించి శ్రీరంగం క్షేత్రంలో దర్శనమిస్తున్నారు. 
ఈ దైవీక అద్భుతాలను పక్కనబెట్టి ఆ ఆలయ కుంభాభిషేక మహోత్సవ వైభవాలను కాస్త తెలుసుకుందాం.   

కుంభాభిషేకం అంటే ఏమిటి?

ఓ పుణ్యక్షేత్రంలో శివలింగ మూర్తిని ఎలా ప్రతిష్ట చేస్తారు; ప్రతి భగవద్‌మూర్తి విగ్రహం దిగువన ఓ చక్రం లేదా యంత్రం ప్రతిష్టింపబడి ఉంటుంది. ఆ యంత్రంలోని అక్షర శక్తులు ఎంతటి సిద్ధిని మనకు అందిస్తుంది. 
పన్నెండు సంవత్సరాలకొకమారు ఆ యంత్రాలను తొలగించి కొత్త చక్రాలను ప్రతిష్టించాలి. అయితే ఓ అక్షరానికి సిద్ధిని ఒనగూర్చే అర్హత నేటి పరిస్థితుల్లో ఎవరికీ లేకుంటే ఒక యంత్రాన్ని తయారు చేయడం ఎలా? కనుకనే ఆలయ కుంభాభిషేకం అంటే నేటి పరిస్థితుల్లో దైవీక శక్తుల్ని పునరుత్తేజపరచకుండానే ఏదో గోపురాలకు, గోడలకు వెల్లవేసి శుభ్రపరిచే తంతుగా మారిపోయింది. 
ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురవుతాయని జ్ఞానులు, సిద్ధపురుషులకు తెలియకుండా ఉంటుందా? కనుకనే తిరుజ్ఞాన సంబంధరు, అప్పరు‌ వంటి మహాపురుషులు సుదీర్ఘత తపస్సులాచరించి తమ తపఃశక్తులన్నింటినీ ఆలయంలోని ఆ యంత్రాలకు ధారపోసి దైవీక శక్తులను పునరుద్ధరింపజేశారు. దీనిని ఆలయ పునరుత్థానం అని చెబుతుంటారు. 
కనుకనే అప్పరు‌, సుందరరు‌ వంటి మహాపురుషుల పాదాలు మోపిన పుణ్యక్షేత్రాలలో కనీసం వెయ్యేళ్లకొకమారు దైవీక శక్తులను పునరుత్తేజపరుస్తారని సిద్ధపురుషులు స్పష్టం చేస్తున్నారు. తిరుజ్ఞాన సంబంధమూర్తి, అప్పరు పెరుమాళు‌, ఆళ్వార్లు వంటి మహాపురుషులు కీర్తనలను ఆలాపించిన స్థలాలు విశేష శక్తులను కలిగి ఉంటాయి. ఆ కారణంగానే కీర్తనలు ఆలాపించిన క్షేత్రాలు, మంగళాశాసన స్థలాలలో అనుసరిస్తున్న ప్రార్థనలన్నీ చక్కటి ఫలితాలను ఇచ్చే క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. 
పైన పేర్కొన్న సంగతుల్ని పూసగుచ్చి మాలగా కడితే, ఇలాంటి పుణ్యక్షేత్రాలలో దైవీక శక్తులు పునరుత్థానం చేసి ఆలయాలలో దైవీక శక్తులు పలురెట్లు పెంచే శక్తిసామర్థ్యాలు కలిగిన ఇడియాప్ప సిద్దపురుషుడు లోక కల్యాణం కోసం అందించిన వరపుత్రుడే శ్రీవెంకటరామ ‌స్వాములని మనకు స్పష్టమవుతున్నది కదా? 
ఇడియాప్ప సిద్ధపురుషుడి లీలా వినోదాలను మరికాస్త వివరిద్దాం. సోమాసి మారనారు‌ యాగంలో మహాశివుడే ప్రసాదం తీసిచ్చారు కదా? ఆ ప్రసాదం మానవదేహంలో రక్తమాంసాలుగా రూపొందుతాయి. మాంసం స్థూల వరశక్తిని, రక్తం సూక్ష్మ వరశక్తిని గ్రహిస్తాయి. 

శ్రీ పచ్చైయమ్మవారి కోవెల
తిరుఅణ్ణామలై

బ్రహ్మమూర్తి తండ్రిగారైన శ్రీమహావిష్ణువే పితృదేవతలందరికీ పితామహుడు. ఆ పితృదేవతలు రక్తసంబంధీకులు సమర్పించే తద్దినపు పిండ ప్రదానాలను స్వీకరిస్తారు. వాటి ద్వారా తమ వంశావళిని పవిత్రపరుస్తుంటారు. వీటి నుండి మనకు తెలిసేదేమిటంటే రక్తమే బంధుత్వానికి ఆధారం. బంధుత్వమే పవిత్రతను పెంచిపోషిస్తుంది. ఈ సంగతిని బోధపరిచేలా ధన్వంతిరిమూర్తి జలగలను చేత ధరించి దర్శనమిస్తున్నారు. కనుకనే ఆ పరమేశుడే స్వహస్తాలతో సోమాసి ప్రసాదంగా అందించిన భార్గవవేద శక్తులను ఆ బాలుడైన వెంకటరామన్‌ను దేహంలో స్థిరపరచేందుకు సాయపడినవే ఆ కామాఖ్య జలగలు. వాటిని ఇడియాప్ప సిద్ధపురుషుడు తన కరకమలాలతో మరింత పవిత్రపరిచారు. శివుడిచ్చిన భార్గవ యోగశక్తులు కామాఖ్య దేవి అనుగ్రహశక్తులతో కలిసి పరిపూర్ణత చెందాయి. 
ఇలాంటి శివ, శక్తి, గురు, భక్తితత్త్వ వేదశక్తులను శ్రీవెంకటరామస్వాములు ఆలయాల సంప్రోక్షణలు నిర్వహించేటప్పుడు ఆయా ఆలయాలలో ఉన్న యంత్రాలలో సూక్ష్మరూపంలో ప్రతిష్టించారన్నదే ఆధ్యాత్మిక అద్భుతమైన అరుదైన విశేషంగా పరిగణించాలి. 
ఇలాంటి అపరిమితమైన వేదశక్తులు కలిగి ఉన్న ఆలయాలు ఎన్ని వేల సంవత్సరాలపాటు పవిత్రతో భాసిల్లుతాయమో మన ఊహకందని విషయం! ఇలాంటి ఆధ్యాత్మిక విప్లవానికి ధీటైన దైవకార్యం ఈ ప్రపంచంలో మరెక్కడైనా చూడగలమా? 

ఇలాంటి రక్త పునీత కైంకర్యాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి భక్తులను విస్మయపరచినవారే మన శ్రీవెంకటరామస్వామిగారు. పవిత్రక్షేత్రమైన కోయంబేడులోనే ఈ భువిలో తొట్టతొలుత ప్రదోష ఆరాధన నిర్వహించబడింది. ఆ క్షేత్ర ప్రాకారంలో 30 యేళ్లకు ముందు శ్రీవెంకటరామస్వామివారు ప్రదోష నాయనారుని తన భుజస్కంధాలపై మోసి నృత్యం చేసిమరీ స్వామివారి సంతోషపరిచారు. జీర్ణోద్ధరణ పనులు జరుగుతుండటంతో అప్పట్లో ప్రాకారమంతటా చలువరాళ్లతో నిండి ఉండేది. కనుకనే స్వామివారు మోకాళ్లూని స్వామిని భుజస్కంధాలపై మోసి నాట్యమాడుతూ ప్రదక్షిణ చేయడంతో మోకాళ్లలో రక్తం ధారగా కారింది. అయితే స్వామివారు వాటినన్నింటి గురించి చింతించక తన నాట్యాన్ని పూర్తి చేసి కైంకర్యాన్ని ముగించటం మైమరపించే ఆధ్యాత్మికపరంగా ఆశ్చర్యం కలిగించే విషయం. సోమాశి యాగ ప్రసాదాన్ని స్మరించే విధంగా ప్రతియేటా కార్తీక దీప మహోత్సవం సందర్భంగా గిరిప్రదక్షిణ చేసే భక్తులకు పెద్ద పెద్ద మరమరాల ఉండలను శ్రీవెంకటరామస్వామివారు పంచిపెట్టిని విషయం మీకందరికీ విదితమే కదా! 
స్వామివారు భవిష్యత్‌లో అన్నదాన కైంకర్యాన్ని నిర్వహించేందుకు దోహదపడేలా ఆ పెద్దాయన సిన్నోడికి అందించిన దైవీక లీలావిశేషాలను వర్ణింప శక్యం కాదు. సోమాశి ప్రసాదమైన మరమరాల ఉంటను తీసిఇచ్చిన పెద్దాయన ఆ సిన్నోడు భవిష్యత్‌లో చేయబోయే అన్నదాన కైంకర్యంలో రుచిని ఏర్పరచేందుకు ఆయన చేసిన లీలావినోదమే పచ్చబొట్లు పొడిపించటం. 
అవును. కామాఖ్యా యాత్ర సమయాన ఓ ఆటవిక యువతి సిన్నోడికి పచ్చబొట్లు పొడిచింది కదా? ఆ విషయం గురించి సిన్నోడికి తెలుపలేదు. అయితే, ఓ సారి పెద్దాయన సిన్నోడిని ఓ మంచి నిక్కరును కొనివ్వమని అడిగారు. 
సిన్నోడికి ఏమీ అర్థం కాలేదు. 'గురువుగారూ, మీరెప్పుడూ కౌపీనమే ధరిస్తారు కదా. ఇప్పుడెందుకు చెడ్డీని అడుగుతున్నారు?' అని అడిగినప్పుడు 'నేనేం చేయను చెప్పు సిన్నోడా, నీకయితే ఆ పరమేశ్వరుడే వచ్చి బట్టలు కొనిస్తాడు, ఆటవిక యువతి వళ్ళి వచ్చి నీకు పచ్చబొట్లు పొడిచివెళుతుంది. మరి ఈ ముసలోడిని ఎవరుపట్టించుకుంటారు? అందుకనే అడుగుతున్నా నాకు కొత్త చెడ్డీ వద్దు పాత చెడ్డీ ఉన్నా ఫరవాలేదు' అన్నారు. 
సిన్నోడికి అప్పుడే కామాఖ్య యాత్ర సమయంలో జరిగినందంతా మెరుపులా గుర్తుకొచ్చింది. 

శ్రీ కంబత్తు ఇలయనారు సన్నది
తిరుఅణ్ణామలై

'ఆహా మనకు పచ్చబొట్లు పొడిచింది వళ్లిదేవియా?' ముత్యాల్లాంటి ఆ యువతి దంతాలు మెరవడం వెనుక రహస్యమేమిటో సిన్నోడికి ఇప్పుడే తెలిసింది. సాక్షాత్‌ కుమారస్వామి సతీదేవీకి తప్ప మరెవరికీ అంతటి దైవీకమైన పలు వరుస ఉండే ఆస్కారమే లేదనుకుని పెద్దాయన తనపై ప్రసరించిన కృపాకటాక్షాలు తలచుకుని మురిసిపోయాడు. 
అంతేకాదు వళ్లిదేవి తనకు అందించిన అనుగ్రహ శక్తులను కూడా పెద్దాయనను అడిగి తెలుసుకున్నాడు సిన్నోడు. 
ఆటవిక యువతిగా వచ్చిన వళ్లిదేవి సిన్నోడి అరచేతిని తీక్షణంగా చూసింది కదా? దాని దైవీక తాత్పర్యమేమిటి? 
చేతి రేఖలలో పలు రహస్యాలు దాగి ఉంటాయి. అరచేతిలోని రేఖలలో ధనరేఖ ఉంటుంది. అరచేతి అడుగుభాగం నుండి పైపైకి వెళ్లే సూర్యుడి మిట్టపై ముగిసేదే ధనరేఖ. సాధారణంగా ధనరేఖలు కలిగినవారు స్థిరచరాస్థులను మెండుగా కలిగి హాయిగా జీవిస్తుంటారు. 
వారి చేతిలో వస్తువులుగానీ, ధనం కానీ తీసుకుంటే అవి వృద్ధి చెందుతాయి. ధుర్యోధనుడికి ధనరేఖ ఉండటంవల్లే రాజసూయ యాగం నిర్వహించినప్పుడు ధర్మరాజు అతడి చేతుల మీదుగా దానధర్మాలు చేయించాడు. పాండవుల ఖజానా ఖాళీ అయ్యేలా ధుర్యోధనుడు విరివిగా ధనరాశులన్నింటినీ దానం చేశాడు. తర్వాత తన మామగారైన శకునితో దుర్యోధనుడు మాట్లాడుతూ 'మామా ఈ ధర్మపుత్రుడు తెలివిలేని దద్దమ్మలా ఉన్నాడు. ఖజానాలోని సకల సంపత్తులను దానం చేయమని చెప్పాడు. అదే అనువైన సమయమనుకుని నేను వారి ఖజానాను ఖాళీ చేసేశాను' అని గర్వంగా పలికాడు. 
ఆ మాటలు విన్న శకుని హేళనగా నవ్వుతూ 'దుర్యోధనా ధర్మపుతుడ్రు తెలివిలేని దద్దమ్మ కాదు. వాస్తవానికి నీవే నూటికినూరుపాళ్లు తెలివిలేని మూర్ఖుడివి. నీ చేతుల మీదుగా దానం చేయమని ఆజ్ఞాపించింది శ్రీకృష్ణభగవానుడు. దానికి కారణమేమిటనుకున్నావు? కృష్ణుడు ఓ కార్యం చేయమంటే దాని వెనుక ఏదో మేలైన అంతరార్థం దాగి ఉంటుందని నీవు ఆలోచించలేదా? నీ చేతిలో ధనరేఖ ఉంది. నీవెంత దానధర్మాలు చేస్తావో అంతకు వెయ్యిరెట్లు సకల సంపదలు పాండవులకు చేకూరుతాయి. ఇప్పుడు చెప్పు నిజమైన మూర్ఖుడెవడో?'' అని అన్నాడట. ధన రేఖలో పలు సూక్ష్మరహస్యాలు దాగి ఉన్నాయి. ధనరేఖలు సూర్యుడి మిట్టపై నిలిచే స్థితిని బట్టి దానిని నిర్ణయించటం జరుగుతుంది. ఈ విధంగానే శ్రీవెంకటరామస్వామివారి చేతిలో బాలా ధనరేఖ కొలువుదీరింది. 
బాలా ధనరేఖలు కలిగినవారు తయారుచేసే అన్నపానీయాలు చాలా శుచిగా రుచిగా ఉంటాయి. వారి చేతుల ద్వారా స్వీకరించే ధనకనకాది వస్తువులు శుభకార్యాలకు మాతమ్రే ఉపయోగపడతాయి. ఈ బాలా ధనరేఖ శక్తులన్నింటిని సూక్ష్మంగా అమర్చటం వళ్లిదేవి లీలావిశేషాలలో ఒకటిగా పరిగణించాలి. 

ధనరేఖ రహస్యం

ఇక ధనరేఖలలో మాలా ధనరేఖ అనే మరో ధనరేఖ కూడా ఉంది. మాలా ధనరేఖతో కీర్తిగడిచినవారు శేషాద్రి స్వాములవారే. 
ఇలాంటివారు ఏమిచ్చినా వాటిలో సంపత్‌శక్తులు పెరుగుతాయి. అయితే ఆ దైవీక శక్తులను నిందిస్తే పలు అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది. 
ఉదాహరణకు, శేషాద్రిస్వాములు ఓ ఉల్లిపాయల దుకాణంలోకి వెళ్లి కొన్ని ఉల్లిపాయలను రోడ్డుపై విసిరాడనుకొందాం. అప్పుడేమవుతుంది. ఉల్లిపాయలు రోడ్డుపై వెళుతున్న వాహనాల కింద నలిగిపోతాయి. అయితే దుకాణం యజమాని గనుక ఇవేవీ పట్టించుకోకుండా ఉంటే అతడి వ్యాపారం రెట్టింపు అవుతుంది. త్వరలోనే అతడు కోట్లకు పడగెత్తి సంపన్నుడవుతాడు. అలా కాకుండా శేషాద్రిస్వామి చేతిలోని ఉల్లిపాయలను లాక్కుంటే ఆ దుకాణంలోని ఉల్లిపాయలన్నీ చెడిపోతాయి, దుకాణం యజమాని సైతం కష్టాలపాలవుతాడు. ఈ అనుభవాలను ఎందరో స్వయంగా వీక్షించారు కూడా! ఇవే మాలా ధనరేఖ అనుగ్రహశక్తి గొప్పదనం. నిర్ణీత జాతకలక్షణాలు ఉన్నవారికే ఇలాంటి మాలా ధనరేఖలు ఏర్పడతాయి. శ్రీశేషాద్రిస్వాములవారి జాతకాన్ని పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని తెలుసుకోగలం! సాధారణంగా లగ్నం, రెండు, ఐదు, తొమ్మిది, పదకొండో స్థానాల పటిష్టతను బట్టే ధనయోగాలను నిర్ణయిస్తారు. స్వామివారి జాతకంలో లగ్నాధిపతియైన గురువు సంపత్‌ అధిపతిగా ఐదోస్థానంలో ఉండి, పంచమాధిపతియైన అంగారకుడు రెండో ఇంట ఉచ్చస్థితిలో ఉండి, రెండవ అధిపతియైన శనీశ్వర భగవానుడు లగ్నంలో కొలువై, పదకొండో స్థానాధిపతియైన శుక్రుడు ఉపస్య మూడోస్థానంలో కొలువై అది రాశినాధుడికి ఉపస్య షష్టమాధిపదిగా అమరి, ధర్మ, కర్మ, రాజయోగ అధిపతులు ఏకమై ధనస్థానంలో కొలువై ఉండటం శక్తివంతమైన ధనయోగాన్ని తెలియజేస్తుంది. 
పైగా ఈ ధనయోగంతోపాటు రాజయోగాలు చేరి ఉండటం, పారిజాత యోగం కూడా ఈ ధనయోగానికి బలాన్ని చేకూర్చేలా అమరి ఉండటం దైవీక అమరికగా పేర్కొనవచ్చు. 
ధనయోగం అనేది కేవలం సంపదలను మాత్రమే సమకూర్చదు. క్రమశిక్షణలేనివారిలో క్రమశిక్షణను ఏర్పరస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్నవారికి సుఖనిద్రను అందివ్వటం ధనయోగ అనుగ్రహమే కదా? 

శ్రీ పృత్వి నంది మూర్తి
తిరుఅణ్ణామలై

ఓసారి శేషాద్రిస్వాములు తిరుఅణ్ణామలైలో గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ వేశ్య కంటబడింది. పూర్వజన్మ కర్మల కారణంగా ఆ యువతి వేశ్యగా ఉందనుకున్నా, భవిష్యత్‌లో ఆమె చేయనున్న ఆధ్యాత్మిక సాధనలను తన దివ్యదృష్టితో తెలుసుకున్న స్వాములు ఆ యువతిని గాఢంగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. దాని ఫలితంగా మరుసటి రోజే ఆ యువతిని పులియూరు జమీందారుడు వివాహమాడి వెంట తీసుకెళతారు. ఆ తర్వాత ఆ యువతి తన చెడుగుణాలకు స్వస్తి చెప్పి సుగుణవతిగా, మంచి భక్తురాలిగా మారింది. ఇది అందరికీ తెలిసిన అరుదైన వింత విషయం! 
వీటన్నింటి నేపథ్యంలో జరిగిన ఆధ్యాత్మిక వింతలన్నీ సిద్ధపురుషులకే ఎరుక! 
శేషాద్రి స్వాములు ఓ యువతిని కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారని చదివిన వెంటనే పలువురికి పలురకాల హేహ్యభావాలు కలుగుతాయి. అయితే స్వాములు ఆ యువతి భుజాలపై చేయి పెట్టగానే ఆయన చేతిలో ఉన్న ధనరేఖలు స్పర్శించటంతో ఆ యువతి అప్పటిదాకా చేసిన పాపాలన్నీ పటాపంచాలయ్యాయి. 
ఉప్పుతిన్నవారు నీళ్లు తాగి తీరవల్సిందే అన్నట్లు ఆ యువతి పాపాలను హరింపజేసిన వ్యక్తిపై వాటి ప్రభావం పడకుండా ఉంటుందా. అప్పుడే మాలా ధనరేఖల శక్తిసామర్థ్యాలు పనిచేయనారంభిస్తాయి. శేషాద్రిస్వాములు ఆ యువతిని ముద్దుపెట్టుకున్నప్పుడే ఆమె చేసిన పాపకృత్యాలు మాలా ధనరేఖ ద్వారా ఆకర్షింపబడి స్వాములను చేరుకుంటాయి. వాటివల్ల కలిగినే కష్టాలను స్వాములు భరించకతప్పుదు. అదెలాగంటే? 
కుప్లంగా చెప్పాలంటే స్వామివారు కొన్నిక్షణాల పాటు సలసల కాగుతున్న సీసాన్ని ముఖ్యంలో పోసినట్లు విపరీతమైన బాధను భరించవలసి ఉంటుంది. అలాంటి బాధలను భరించగలిగేవారికే మాలా ధనరేఖలు ఉంటాయి. 
ఈ కర్మకృత్యాల నివారణోపాయాన్ని వివరించిన శ్రీవెంకటరామస్వాములు 'సారు,‌ చూశారా.. జ్ఞాని, మహాపురుషుడు, గురువు అనే పదవులు వెలుపలి నుండి చూసేవారికి గొప్పగా అనిపిస్తాయి. అయితే కాస్త అంతర్గతంగా పరిశీలిస్తేనే ఒక్కో జ్ఞాని ఎలాంటి వేదనలను అనుభవిస్తున్నదీ, దుఃఖాలను అనుభవిస్తున్నావారికి ఎలా మంచి మార్గాలను చూపెడుతున్నదీ తెలుస్తాయి. 
శేషాద్రిస్వాముల అంతులేని త్యాగభావాలను ప్రశంసిస్తూ రమణమహర్షి చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. 
రమణాశ్రమంలో రమణమహర్షి కోసం ఓ అందమైన సోఫాను తీసుకువచ్చి భక్తులు ఆయనను కూర్చోమని వేడుకున్నారు. అయితే రమణమహర్షి చాలా సేపు ఆ సోఫానే చూస్తు నిలిబడ్డారే కాని అందులో కూర్చోలేదు. అప్పుడొక భక్తుడు 'స్వామీ! మీరు కూడా శేషాద్రిస్వాములవారిలా ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉన్నారే?' అని అడిగాడు. రమణమహర్షి 'ఆధ్యాత్మిక తన్వయత్వంలో శేషాద్రిస్వాములు. ఆ స్థితి నాకింకా రాలేదేమిటా అని చింతిస్తున్నాను' అని సమాధానమిచ్చారు. 
ఇలా ఆధ్యాత్మిక తన్మయత్నంలో పరులకోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాపురుషుడే శేషాద్రిస్వాములు. 
రమణమహర్షి మాట్లాడుతూ 'శేషాద్రిస్వాముల వద్ద ఇంకొక అపూర్వమైన విశేషమైన శక్తి కూడా ఉంది. ఆయన వరాహమూర్తిగా ఆశీనులు కాగలరు. ఆ అర్హత ఆయనకు మాత్రమే ఉంది. ఆ అర్హతను ఎలా సంపాదించుకోగలమా అని నేను ఆలోచిస్తున్నానను' అనే పేర్కొన్నారు. 
శేషాద్రి స్వాములకు మాత్రమే ఈ వరాహియోగంలో ఆశీనులైన అనుగ్రహించగల శక్తి సామార్థ్యాలు ఉన్నాయి. దానికి కారణమేమిటి? స్వాములు మకరపుత్రుడిగా అవతరించటం దానికి కారణం. 
రమణమహర్షి శేషాద్రిస్వాములను కీర్తించినప్పటికీ ఆయన చేసిన త్యాగము నిరుపమానం. 
కౌపీనధారియైన పెద్దాయన ఓసారి సిన్నోడితో రమణమహర్షిని గురించి చెబుతూ 'ఓ రోజు మన అగస్త్యులు నన్ను పిలిచారు. ఎందుకు పిలిచారని అడిగితే ఆయన 'నాయనా మన పిల్లల (దేవతలు) రాముడికి (రమణమహర్షిని అగస్త్యులవారు రాముడనే పిలుస్తుంటారు) కౌపీనం ధరింపచేయండని చెప్పారు. సరేనంటూ పలు సంవత్సరాలుగా వెళ్లి వస్తున్నారే తప్ప అతడు కౌపీనం ధరించినట్లు తెలియలేదు' 
'ఏమిటా విషయమో నువ్వెళ్లి చూసిరా' అని పంపారు. 
'నేను రాముని (రమణుడి) వద్దకు వెళ్లి కౌపీనం ఎలా ధరించాలో తెలిపి తిరిగొచ్చాను' 
'ఇప్పుడు చూడు సోకుగా దానిని (సిద్దుల బాణీలో) కట్టుకుని ఎలా కూర్చున్నాడో' 

'జరిగినదంతా అగస్త్యులవారికి తెలిపాను. 'ఏమీలేదు సామి మన పిల్లలు (దేవలోక దూతలు) కౌపీనాన్ని సక్రమంగానే కట్టారు. కానీ దానిని గార్దబ కర్ణం లాగా ముడివేయలేదు. నే వెళ్లి గార్దబ కర్ణం పెట్టి గట్టిగా ముడివేసి వచ్చాను. అంతటితో పని పూర్తయ్యింది' అన్నాను. 
'విషయం తెలుసుకుని అగస్త్యులవారు చాలా సంతోషించి, మంచి కార్యం చేశావు నాయనా. ఇదిగో నేనిచ్చే కానుకను స్వీకరించు అంటూ తుమ్మపువ్వుల్లాంటి తెల్లనైన కౌపీనాన్ని ఇచ్చారు' అన్నారు పెద్దాయన. 

గాడిద చెవి కౌపీనంలో శ్రీ రమణ మహర్షి

'ఆ కౌపీనాన్ని కళ్లకు అద్దుకుని తీసుకొచ్చా! ఇదిగో దీన్ని నువ్వే ఉంచుకో నాయనా! నువ్వే చాలా మంచి కార్యాలు చేయబోతున్నావు. ఈ ముసలోడికి అదంతా అసాధ్యం కదా' అంటూ పెద్దాయన మన సిన్నోడు వెంకటరామన్‌కు ఆ కౌపీనాన్ని అందజేశారు. 
వెంకటరామ‌స్వాములు పెద్దాయన ఇచ్చిన ఆ కౌపీనాన్ని ధరించే తర్వాతి కాలంలో నిర్వహించిన అన్నదాన మహోత్సవాలను జరిపారన్న విషయం అందరికీ తెలియని ఆధ్యాత్మిక రహస్యం. 

గార్దబ కర్ణం (గాడిద చెవి) తెలిపే కర్మ స్థితి 

గార్దబ కర్ణమంటే ఏమిటి? ఈ లోకంలో మానవులు జన్మించటానికి కారణమే వారు మునుపటి జన్మలో చేసిన కర్మఫలితాలే కారణమని సాధారణంగా చెబుతుంటాం. ఇలా ఓ మానవుడి కర్మ ఫలితాలు ఎన్నో కారణాల వల్ల ఇతరులకు చేరుతుంటాయి. 
ఉదాహరణకు ఒకడు ధూమపానం చేస్తున్నాడనుకుంటే అతడు యేడాదిపాటు ఓ వ్యాధిని అనుభవించాల్సి ఉంటుందని అనుకుందాం. ఆ పరిస్థితిలో అతడి స్నేహితుడొచ్చి ఉచితంగా ఓ కాపీ అడిగి తాగితే ధూమపానం చేసినవాడికి కర్మఫలితం కాపీ తాగిన వ్యక్తికి చేరుతుందనేది విధి. దైవ విధి. 
కర్మ తీవ్రతను బట్టి కాపీ తాగిన స్నేహితుడు ఒక రోజులోపున లేదా యేడాది తర్వాత కూడా కాపీ ఇచ్చిన మిత్రుడు అనుభవించాల్సిన వ్యాధిని అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధంగానే కర్మ ఫలితాలు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందుతుంటాయి. 
ఇలా కర్మఫలితాలు ఒకరి నుండి ఇతరులకు వ్యాప్తి చెందటానికి వేవేల పరికరాలు ఉన్నప్పటికీ, వీటిలో అన్నింటికన్నా సులువుగా స్పర్శ ద్వారా బదలీ అవుతాయి. అంటే ఒకరిని తాకితే చాలు కర్మఫలితాలు ఆ వ్యక్తికి వ్యాప్తి చెందుతాయి. వీటిని వివరిస్తే సామాన్య ప్రజానీకంలో అయోమయ పరిస్థితులు అధికమవుతుందనే పెద్దలు, మహానుభావులు మరింతగా వివరించరు. 
స్పర్శ ద్వారా వ్యాపించే కర్మఫలితాల తర్వాత ప్రజలు ధరించే దుస్తుల మూలంగాను కర్మఫలితాలు వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి కర్మల స్థితిని, కర్మల వల్ల కలిగే వేదనలను పూర్తిగా గ్రహించే జీవులే గార్దబాలు. కనుకనే మానవుల కర్మఫలితాలను భరించటానికి దేవునిచే సృష్టించబడినవే గార్దబాలు. ఓ గార్దబం భరించనంతగా కర్మఫలతాలను ఏ మనిషీ మోయలేడు. ఈ విషయం రజకులకు మాతమ్రే తెలుసునుకనే ఏ రజకుడూ మురికిబట్టలను తాను మోసుకెళ్లడు. 
మురికి బట్టలను గార్దబం ద్వారా మోయించి వాగు, వంకల వద్దకు తీసుకెళ్లి వాటిని నీటిలోకి తోసేస్తాడు. ఆ మురికబట్టలు నీటిలో పూర్తిగా తడిసిన మీదటే వాటిని తీసి ఉతుకుతాడు. 
అనివార్య పరిస్థితులలో వాటిని ఆ మురికబట్టలను మోయాల్సి వస్తే, ఆ కారణం చేత రజకుల రోజులతరబడి అనారోగ్యం పాలవుతారు. అలా అస్వస్థతకు గురైన రజకుడిని చూసి గార్దబం లోలోపల నవ్వుకుంటుందట. 'చూశారా, ఒక రోజు కర్మఫలితాన్నే వీడు భరించలేకపోయాడు. నేనేమో యేళ్లతరబడి ఎంతమంది కర్మఫలితాలను మోయగలుగుతున్నాను కదా అని గర్వంతో పొంగిపోతున్నస్పుడు దాని చెవులు నిక్కబొడుచుకుంటాయట. 

శ్రీ ఉణ్ణాములై అమ్మవారి మండపం
తిరుఅణ్ణామలై

అలా నిటారుగా నిక్కబొడుచుకునే చెవులనే గార్దబ కర్ణాలు (గాడిద చెవులు) అని పిలుస్తుంటారు. 
రమణమహర్షి పదివేలకు తక్కువగా కాకుండా అరుణాచలేశ్వరుడిని మానసికంగా గిరి ప్రదక్షిణ చేసి దక్షిణామూర్తి దర్శనం పొందిన మహాపురుషుడు కదా; అయితే మహాపురుషులు తాము పొందిన అనుగ్రహాలను తమ వద్దే దాచిపెట్టుకోరు. వాటిని ఇతరులకు పంచిపెట్టడమే వారి నియమం. అలా తమ అనుగ్రహాలను పంచిపెట్టడం వల్ల ఇతరులనుండి కర్మఫలితాలు వారిలోకి వ్యాప్తి చెందుతాయి. ఆ కర్మఫలితాల కారణంగానే మహాపురుషులకు కేన్సర్‌, మధుమేహం, గుండెజబ్బు వంటి వ్యాధులను వారు భరిస్తూనే సమాజానికి తమ సేవలను అందిస్తున్నారు. 
ఇలా ఇతరుల కర్మఫలితాలను భరించటానికి ఒక సాధనంగా కౌపీనంలో గార్దబ కర్ణంలాంటి ముడివేసుకొనే పద్ధతినే రమణులకు మన పెద్దాయన వివరించారు. 
ఈ కర్మఫలితాలను మహాపురుషులు ఒక్కొక్క విధంగా నెరవేరుస్తారు. కంచి పరమాచార్యుల దండం, విసిరి స్వామివారి విసనకర్ర, కసవనంపట్టి సిద్ధపురుషుడి బీడీ, వెంకటరామస్వాముల వరుస మడతలు మీకు తెలిసిన కొందరి మహానుభావుల గార్దబ కర్ణాలే!   

నిర్వికల్ప సమాధి

పెద్దాయన తనకు కామాఖ్య యాత్రలో అడవి మనిషిగా వచ్చినవాడు పరమేశ్వరుడని తనకు ఎరుకపరచలేదన్న దిగులు సిన్నోడికి అధికమవుతూ వచ్చింది. ఆ విషయాన్ని నోరుతెరచి పెద్దాయనను అడుగకపోయినా ఈ మనోక్లేశం సిన్నోడిని బాధిస్తూనే వుండేది. 
పెద్దాయనపై ఉన్న ఈ కోపం కంటే ఇన్ని ఆలయాలను దర్శనం చేసుకున్నా, ఎన్నో దైవ కార్యాలు, వ్రతాలు ఆచరించినా, పలు పవిత్ర తీర్థాలలో స్నానమాచరించినా, కాళ్లరిగేలా తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ చేసినా మన మెందుకింకా వెర్రిబాగులవాడిగానే ఉంటున్నాం కదా అనే మనోవేదన మరింత అధికమైంది. 
ఆ సిన్నోడి బాధను తెలుసుకోలేని సామాన్యుడా ఇడియాప్ప ఈశ్వరుడు? 
ఓ రోజు తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గంలో పెద్దాయన వెంట నడచివెళుతున్న సిన్నోడిని గిరిప్రదక్షిణ మార్గం నుండి తప్పించి ఆ కొండకు ఇంకొక వైపునకు తీసుకెళ్లారు. 
సిన్నోడికి ఖుషీ పెరిగింది. గిరి ప్రదక్షిణ మార్గం తప్పించి మరో మార్గంలో పెద్దాయన తీసుకెళితే ఆ బాటలో ఏవో ఆధ్యాత్మిక రహస్యాలను ఉంటాయని పలుమార్లు సిన్నోడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తరచూ మిట్టాపల్లాలు, ముళ్లు, పొదలతో కూడిన మార్గాలలో తీసుకెళ్లే పెద్దాయని ఈమారు చదునైన బాటలో నడిపించి తీసుకెళ్లడం సిన్నోడికి ఆశ్చర్యం కలిగించింది. 
కాసింత దూరం వెళ్లాక పెద్దాయన సిన్నోడిని అక్కడే నిలబడమని చెప్పి బట్టలన్ని విప్పమన్నారు. సిన్నోడు వెంటనే దుస్తులను విప్పిపడేసి అవధూతలా ఎదుట నిలిచాడు. 
'ఆ జంధ్యాన్ని కూడా తీసేయ్‌' అని పెద్దాయన చెప్పగానే సిన్నోడు జంధ్యాన్ని తీసి దుస్తులపై ఉంచాడు. 
అవధూత రూపం సంపూర్ణమైంది. 
పెద్దాయన నేలకేసి నడుము వంచి ఏవో మంత్రాలను ఉచ్చరిస్తూ తన శనివేలితో నేలపై గీత గీసారు. మరుక్షణం ఆర్టీషియన్‌ ఊటలా భూమిలోపలి నుండి జలం ఉవ్వెత్తున చిమ్ముకొచ్చి సిన్నోడిని తడిపేసింది. 
సిన్నోడు ఆ అద్భుతసృష్టికి అబ్బురపడ్డాడు. 
భూమినుండి తీర్థం పుట్టకురావడమే ఆశ్చర్యమనుకుంటే ఆ నీటిఊట కైలాసపర్వతంలోని మానసరోవర జలాల్లా చల్లదనం ఉండటం మరీ ఆశ్చర్యం! పెద్దాయన సిన్నోడిని కైలాసపర్వతంలో మానసరోవర యాత్రకు తీసుకెళ్లినప్పుడు మానస సరోవర తీర్థాన్ని కూడా చూపించారు. సుమారు 250 అడుగుల లోతైన ఆ కొలను అట్టడుగున ఉన్న గులకరాళ్ళు చేతికి అందేలా చేరువగా ఉన్నట్లు కనిపించాయి. అంతటి స్వచ్చమైన జలాలతో కూడినదే మానసరోవర తీర్థం. 
ఆ సమయంలో ఉన్నట్టుండి సిన్నోడు తనపై వర్షిస్తున్న తీర్థజలాలను చేతి గుప్పిట తీసుకుని నోటిలో పోసుకున్నారు. అంతే! మరుక్షణమే అతడి నోరు, పెదాలు, ముఖం అన్నీ చిట్టిపోయేంతగా బిగుసుకుపోయాయి. పంటి చిగుళ్లలో ముఖం పగిలేంతగా నొప్పులు పుట్టాయి. పళ్లన్నీ వరసగా రాలిపోయేంతటి బాధ కలిగింది. 
సిన్నోడు అచేతనుడయ్యాడు. పెద్దాయనకు తన బాధను చెప్పుకుందామనుకుంటే నోరుపెగలదాయే! చాలాసేపయిన తర్వాతే మళ్లీ సహజస్థితికి వచ్చాడు. 
అప్పుడా పెద్దాయన నవ్వుతూ 'ఒరేయ్‌ తొందర పిడుగా! నిన్ను తీర్థాన్ని చూడమని చెప్పానే గానీ, దానిని ఎందుకు తాకావురా?' అని చిరుకోపంతో కసరుకున్నారు. 
అప్పుడే సిన్నోడు ఓ విషయాన్ని గమనించగలిగాడు. మానస సరోవర తీర్థాన్ని తలపించేలా తనపై వర్షించిన జలాల వల్ల తనకు ఎలాంటి బాధలను కలిగించలేదని అప్పుడే తెలిసింది. గురువుగారి కరుణాకటాక్షాల ఉంటే చాలు కష్టాలు దరిదాపులకు రావని, గురువాజ్ఞలను పాటిస్తే పలు మహత్యాలను తెలుసుకోగలమని సిన్నోడు పాత పల్లవిని గుర్తుకు తెచ్చుకున్నాడు. 
పెద్దాయన ఇలా చేతులూపగానే ఆ తీర్థం అలా అదృశ్యమైంది. 
సిన్నోడిని కాస్త దగ్గరగా తీసుకువచ్చి ఓచోట పద్మాసనం వేసుకుని కూర్చోమన్నారు. కనులు గట్టిగా మూసుకోమన్నారు. సిన్నోడికి లోలోపల సంతోషం. 
ఎందుకంటే మళ్లీ పాతజ్ఞాపకాలు గుర్తుకు రావటమే! 
ఓమారు ఓ శివాలయ ప్రాకారంలో పెద్దాయనతోపాటు సిన్నోడు వెళుతున్నాడు. అక్కడ దక్షిణామూర్తి స్వామి ఎదుట కన్నులు మూసుకుని ఓ నలుగురు ధ్యానం చేస్తున్నారు. వారిని చూడగానే సిన్నోడి మదిలో 'గురువుగారు మనకెందుకు ఇంకా ధ్యానం గురించి నేర్పలేదు. ఎప్పుడు చూసినా మండుటెండలో నడిపించడం, ఆకలిదప్పులతోనే తీర్థయాత్రలకు తీసుకెళ్లడం, గబ్బిలాల మాలిన్యాలను గంపలకెత్తుకుని తొలగించడం, ఎలాంటి వసతులు లేని ప్రాంతాల్లో మట్టి పాత్రలను పెట్టుకుని అన్నదానం చేయడం ఇలా అన్ని కష్టమైన పనులే మనకు కట్టబెడుతుంటారు కదా' 
'ఎప్పుడైనా ఒకసారి ఈ రీతిలో ప్రశాంతమైన చోట దక్షిణామూర్తి స్వామి ఎదుట కూర్చుని ధ్యానం చేసే పద్ధతిని మనకు నేర్పలేదే' అని లోలోపల విసుక్కున్నాడు. 
ఆ సిన్నోడి తలంపులను గ్రహించిన పెద్దాయన 'సిన్నోడా! వాళ్లు ఎలాంటి ధ్యానం చేస్తున్నారో నీకు చెబుతాను. అది నీకు నచ్చితే చెప్పు, ఆ విధంగానే నీకు నేర్పుతాను. ఇలా వచ్చి కూర్చో...' అంటూ తనూ కాస్త దూరంగా జరిగి సిన్నోడితోపాటు కూర్చున్నారు. 
'అదిగో చూడు ఆ చివర జుబ్బా వేసుకుని కూర్చున్నాడే.. అతడు ఏ హోటల్‌లో మసాలా దోసె బాగుంటుందోనని ఆలోచిస్తున్నాడు' 
'వాడి పక్కనే రుద్రాక్ష మాల వేసుకుని ఉన్నాడు కదా.. వాడేమో నిన్న చూసిన కొత్త సినిమాను తలచుకుంటున్నాడు' 
'వీడి పక్కనే వళ్లంతా విభూతి రేఖలు పూసుకుని కూర్చున్నాడే... వాడు ఎవడి పెళ్లాం బట్టలో ఊడదీస్తున్నాడు' అన్నారు. 
'ఇదంతా నువ్వు నేర్చుకోవాలా?' 
ఈ ప్రశ్నకు సిన్నోడు ఏం సమాధానమిచ్చాడో మీరే ఊహించుకోండి. 
'ఇదిగో చూడు. ధ్యానం చేయాలనుకుని కళ్లు మూసుకుంటే ఏం తెలుసుంది. చిమ్మచీకటే కనబడుతుంది. దానివల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది? కళ్లు తెరచి చూడు. నీ ఎదుట పేదవాడు కనిపిస్తాడు. అతడి కడుపు చూడు. అతడి ఖాళీ కడుపును చూడు. రెండు ఇడ్లీ పొట్లాలను అతడికివ్వు. అతడి కడుపు నిండుతుంది' 
'నీ పక్కనే పడుకున్న కుక్కను చూడు. అది రెండు రోజులుగా పస్తులతో ఉంది. దానికి కాసిన్ని మరమరాలు కొనివ్వు. సంతోషపడుతుంది' 
'అంతేకానీ ధ్యానం చేస్తున్నాను భగవంతుడా అంటూ కళ్లు మూసుకుని నిదురపోవడం కన్నా కళ్లు తెరచి నలుగురికి మంచి పనులు చెయ్యి' 
పెద్దాయన చెప్పిన ఇడియాప్ప ఉపనిషత్‌ వాక్యాలు, కౌస్తుభ వేదపాఠాలు సిన్నోడి మనసులో మేకుల్లా గుచ్చుకున్నాయి. 
'రుషీకేశ్‌ శివానందస్వామి చెప్పిందీ కూడా ఇదేరా? భగవంతుడు సృష్టించిన జీవరాశులన్నీ సక్రమంగా వాటి విధులను నిర్వర్తిస్తున్నాయి. విసనకర్ర చల్లటి గాలిని వీస్తుంది... దీపం వెలుగును ప్రసాదిస్తుంది. అయితే మానవుడే ఏం చేయాలో తెలియక సోమరిపోతుగా తిరుగుతున్నాడు' అంటూ పెద్దాయన తన ప్రవచనాన్ని ముగించారు. 

తిరుఅణ్ణామలై ...

పద్మాసనం వేసుకుని కూర్చున్న సిన్నోడి దగ్గరగా వెళ్లి పెద్దాయన తన ఎడమ చేతిని సిన్నోడి రొమ్ముపై ఆనించి, కుడిచేతిని వీపుపైని వెన్నెముక దిగువన ఉంచి సిన్నోడితో 
'మనస్సులో అమ్మవారిని తలచుకో 
మనస్సులో అమ్మవారిని తలచుకో 
మనస్సులో అమ్మవారిని తలచుకో' - అంటూ మూడుసార్లు పలికారు. పెద్దాయన తన చేతులను సిన్నోడిదేహాంపై అదిమిపట్టి ఉంచారు. 
సిన్నోడు ప్రతినిత్యం పలుమార్లు ప్రదక్షిణ చేసి దర్శించుకునే రాయపురం కల్‌మండపం ప్రాంతంలో కొలువుదీరిని అంకాళపరమేశ్వరీదేవిని తన కళ్లెదుట స్థిరపరచి నమస్కరించాడు. మరుక్షణమే ఆ దేవి రూపం మెరుపువేగంతో కాంతిపుంజంగా మారి సిన్నోడి హృదయంలో ప్రవేశించి అంతర్థానమైంది. కొద్ది సేపయిన తర్వాత పెద్దాయన వీపుపై చేతిని ఆనించిన చోట సిన్నోడికి గిలిగింతలు పెట్టినట్లనిపించింది. అతడి దేహంలో ఉష్ణోగ్రత కొద్ది కొద్దిగా అధికమవుతూ వచ్చింది. 

శ్రీ అరుణాచలేశ్వరుడి పాదాలు
తిరుఅణ్ణామలై

ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని దైవసేవకులకు, ఆధ్మాత్మిక ఆప్తులకు స్పష్టం చేయాలనుకుంటున్నాము. పెద్దాయన సిన్నోడి దేహాన్ని స్పర్శించిన తర్వాత అతడికి కలిగిన అనుభవాలన్నీ మాటలతో వర్ణింప వీలుకాని ఆధ్యాత్మిక అనుభూతూలే. అదే సమయంలో ఈ ఆధ్యాత్మిక అనుభవాలను శ్రీవెంకటరామస్వామివారు లోక సంరక్షణార్థం వినియోగించుకోవాలన్న దృఢనిశ్చయంతో ఉండటవల్ల ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలనుకునే భక్తులకు ఈ వివరణలు ఆదర్శమార్గాలుగా ఉంటాయని గనుకనే 'సిన్నోడు అడిగాడు పెద్దాయన చెబుతున్నాడు' అనే రీతిలో ఈ బోధనలను మీకందిస్తున్నాము. 
వీటిని భక్తజనులు పలుమార్లు మనస్సు పెట్టి చదివి ముద్రితమైన మాటల వెనుక దాగిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించమని పదే పదే వేడుకుంటున్నాము. 
వెన్నెముక దిగువ నుండి ఓ వింత శక్తి ఏదో ఉత్తేజమవుతున్న భావన కలిగింది సిన్నోడికి. వర్ణించడానికి శక్యంగాని పరమానందమేదో దేహాన్ని, మనస్సును, ఆత్మను ఆవరించినట్లయ్యింది. 
కనుల ముందర అరుదైన తినుబండారాలు, పలు రకాల ఆహారపదార్థాలు, వివిధ రకాలైన పళ్ల రసాలు కనిపించాయి. వాటినన్నింటిని మింగివేయాలనే తలంపు సిన్నోడికి కలిగింది. ఆలోపున పెద్దాయన స్వరం వినిపించింది 'శాంతి.. శాంతి... శాంతి' అని. 
ఆ ఆహారపదార్థాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి మనో నేత్రాల నుండి అదృశ్యమయ్యాయి. వెన్నెముక దిగువ ఉత్తేజమైనదే కుండలినీ శక్తి అని సిన్నోడికి తెలిసింది. 
ఇప్పుడు ఆ కుండలినీ శక్తి మెల్లగా ప్రాకుతూ స్వాధిష్టాన చక్రాన్ని చేరుకుంది. 
సిన్నోడు ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి అందమైన యువతులు, అంతకు ముందెప్పుడూ చూడని అంతమైన మగువలు వాడి కళ్ల ఎదుట బారులు తీరి నిలిచారు. వారినందరిని తన బిగి కౌగిట బంధించాలనే తలంపు తీవ్రస్థాయికి చేరుకుంది. 
పెద్దాయన మళ్లీ గంట కొట్టారు 'శాంతి...శాంతి...శాంతి' అంటూ. 
అందమైన అమ్మాయిలు అదృశ్యమయ్యారు. 
ఆ తర్వాత కుండలినీ శక్తి మణిపూరక చక్రాన్ని చేరుకుంది. తన దేహబలం ఉన్నట్టుండి పెరుగుతున్నట్లు అనిపించింది సిన్నోడికి. మదపుటేనుగులను సైతం ఉఫ్‌మంటూ ఊదిపడేలా బలంపుంజుకున్నట్లు అనిపించింది. 
పెద్దాయన మళ్లీ హెచ్చరించాడు 'శాంతి... శాంతి...శాంతి' అంటూ. 
సిన్నోడిలో పుంజుకున్న బలం వేగంగా కరగిపోయినట్లనిపించింది. 
ఆ తర్వాత కుండలినీ శక్తి అనాహత చక్రాన్ని చేరుకుంది. 
తన చుట్టూ ఎటుచూసినా వేద శబ్దాలు వినబడుతున్నట్లు తెలుసుకున్నాడు సిన్నోడు. నలువైపులా భగవంతుడి నామాలు ప్రతిధ్వనించాయి. ఈ శబ్దాలన్ని గాయత్రీమంత్రంలో లయమై అవన్నీ ఓంకారంలో లయమయ్యాయి. అంతటా ఓంకార నాదమే వ్యాపించింది. కాసేపట్లో అది కూడా మాయమైనట్లు తోచింది. ఆ తర్వాత విశుద్ధి, ఆజ్ఞాచక్రాలలో సిన్నోడు పొందిన అనుభవాలను మాటలతో వర్ణించలేము. అయితే, తానెవరు అనే ఆత్మజ్ఞానం దానికితోడుగా ఆధ్మాత్మిక స్థితులకు సంబంధించిన జ్ఞానాన్ని సిన్నోడు పొందగలిగాడు. 
ఆజ్ఞాచక్రాన్ని కుండలీశక్తి చేరుకున్నప్పుడు పెద్దాయన యొక్క స్థూల రూప దర్శనం, ఆయన యొక్క సూక్ష్మ రూప దర్శనాలు కలిగి, ఆ రూపాలు దక్షిణామూర్తి రూపంలో ఐక్యమయ్యాయి. కల్పవృక్షాన్ని, సనకాది మునుల దర్శనం, దక్షిణామూర్తి భౌతిక రూప దర్శనం పొందిన సిన్నోడు కళ్ల ముందరే అవన్నీ ఉన్నట్టుండి అంతర్థానమయ్యాయి. 
అంతటా శబ్దం.. అంతటా వెలుతురు, మహాశబ్దపుటానందం. 
పెద్దాయన పలుకులు వినబడుతున్నాయి. 'ఇదేరా బాహ్యాంతర అఖండ సచ్చిదానంద స్వరూపం' 
'ఇప్పుడు స్వామివారి దర్శనం చూడు' 
'స్వామివారి పాదంలోని వేళ్లను చూడు' 
'తెలుస్తోందా?' 
'స్వామివారి కుడి చేతి వేలిని చూడు' 
'కనబడుతోందా?' 
'ఇప్పుడు పక్కగా వెళ్లి చూడు... తెలుస్తోందా?' 
'ఇంకా దగ్గరకు వెళ్లి చూడు. ఇంకా దగ్గరికి వెళ్లి చూడు... ఇంకా దగ్గరగా వెళ్లి చూడు' 
సిన్నోడు చూస్తున్నాడు... చూశాడు.. చూస్తూనే ఉన్నాడు. 
కావేరి నదీతీరంలోని ఇసుకరేణువులను సైతం లెక్కించవచ్చునేమోగాని, ఇప్పటిదాకా భగవానుడి కరుణాకటాక్షాలతో ఆవిర్భవించిన బ్రహ్మమూర్తులను లెక్కించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాంటి బ్రహ్మమూర్తులంతా తామరపుష్పంపై ధాన్యంలో ఉన్న భగవానుడి కుడి పాదపు వేలి కొసన కొలువైన అధ్బుత దృశ్యాన్ని చూశాడు సిన్నోడు. 
పెద్దాయన తీయ్యటి స్వరం స్పష్టంగా వినబడుతోంది. 'ఒరే నాయనా చాలును రారా. ఓ చతుర్యుగం పాటు సామివారిని చూసేశావు. చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి' 
ధ్యానం నుండి లేచాడు సిన్నోడు (లేచారు అనే పదప్రయోగమే ఈ చోట ఉండాలి. కానీ కథాగమనం కోసం లేచాడు అని పేర్కొనటం జరిగింది) అటూఇటూ చూశాడు. ప్రపంచమే విస్మయం చెందేటంతటి ఆధ్మాత్మిక అనుభవాలు సిన్నోడు సంపాదించుకున్నా కౌపీనధారియైన పెద్దాయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు అతడి కళ్లు గురువుగారి పవిత్ర పాదాల కోసం అన్వేషించింది. 
కనుచూపు మేర దూరం వరకూ ఆ కౌపీనధారుడు కనిపించకపోయారు. 
పెద్దాయన ఎక్కడికెళ్లారు? 
'జలగలాంటి పురుగు ఎక్కడికొచ్చింది... ఎక్కడికి వెళ్లింది' పెద్దాయన భావగర్భితంగా గతంలో పలికిన మాటలు అతడి మనస్సులో ప్రతిధ్వనించాయి. 
సిన్నోడు మనసులోనే నవ్వుకున్నాడు. ఓ చతుర్యుగం అంటే 43 లక్షల సంవత్సరాలకన్నా ఎక్కువ. ఇన్ని లక్షల సంవత్సరాలపాటు భగవంతుడిని దర్శనం చేసుకున్నా శ్రీవెంకటరామస్వాములను దర్శనం చేసుకోవడం కంటే ఆయన నిర్దేశించిన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం కంటే కలియుగ మానవుడు వేరే ఏమి సాధించగలడు? 
అద్భుతమైన, ఈ ప్రపంచమే చూడనటువంటి మహాపురుషుడు శ్రీవెంకటరామ స్వామిగారు తాను పొందిన ఆధ్మాతిక అనువాలను ఇతరులకే ధారాదత్తం చేశారు. 
ఎలాగంటే? 
ఎక్కడైతే ఇలాంటి మానవ కల్పనల కంటే ఆధ్యాత్మిక అనుభవాలను పొందారో ఆ పునీతమైన స్థలంలో కోటానుకోట్ల మంది భక్తులు దైవ ప్రసాదమందించి ఆ అణ్ణామలై ప్రసాదంతో దైవీక శక్తులన్నింటిని పొంది నిస్వార్థసేవలందించారు శ్రీవెంకటరామ‌ స్వాములు. ఈ ఆధ్యాత్మిక అనుభవాలకు దన్నుగా అమరిన అగస్త్య తీర్థం నుండి తీర్థాన్ని పొంది తాను నిర్వహించిన అన్నదాన ప్రసాదమహిమలు సంపూర్ణం చేశారనేదీ కూడా ఓ రుచ్చమైన ఆధ్యాత్మిక రహస్యమే! 
అంతటితో ఆగిందా ఆ స్వాముల త్యాగసహిత సేవలు? 
భగవంతుడి దర్శనంతోపాటు అన్నదాన సంకల్పం నెరవేర్చిన శ్రీవెంకటరామస్వాములు ఆ పవిత్ర క్షేతంలోనే తన జీవాలయాన్ని కూడా పొంది భక్తులకు వరదేవతగా భాసిల్లుతున్నారంటే ఆయన కరుణాకటాక్షాలకు సాటిలేదు మరి? అవును అణ్ణామలై శివశక్తి ఐక్య దర్శనమే ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు రంగప్రవేశం చేసిన పుణ్య వేదిక. 

ఓం సద్గురు శరణమ్

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam